: సుందర్ పిచయ్ నియామకం వెనుక కారణం ఇదేనా?
సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ కు సీఈఓగా నియమితుడైన సుందర్ పిచయ్ భారత్ కీర్తిపతాకను టెక్ ప్రపంచంలో రెపరెపలాడించాడు. క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించి, గూగుల్ ప్రొడక్షన్ విభాగానికి పెద్దదిక్కుగా ఉన్న ఈ ఇండియన్ ఒక్కసారిగా సంస్థ సీఈఓగా అవతరించడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ సహా కొన్ని దిగ్గజ సంస్థలు సమర్థులైన వ్యక్తుల కోసం చూస్తున్నాయి. ఇప్పటి పోటీ ప్రపంచంలో సత్తా ఉన్నవాడైతేనే సంస్థను రాకెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లగలడని ఆయా సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ సుందర్ పిచయ్ కు సీఈఓ పోస్టు ఆఫర్ చేసిందన్న వార్తలు వచ్చాయి. పిచయ్ సామర్థ్యం గూగుల్ కు తెలియందికాదు. ట్విట్టర్ ఆఫర్ తో కలవరపడిపోయిన గూగుల్ పిచయ్ ను తమ వద్దే అట్టిపెట్టుకోవాలంటే ఏం చేయాలో అదే చేసింది. ఏకంగా సంస్థకు సీఈఓగా నియమించి ట్విట్టర్ కు నిరాశను మిగిల్చింది.