: 'హనీమూన్' వంకతో ఉగ్రవాదంలోకి...!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరి జిహాదీలుగా మారాలన్న ఆలోచనతో బయలుదేరిన ఓ కొత్తజంటను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే వివాహం చేసుకున్న మహమ్మద్ ఓడా దఖల్లా (22), జలిన్ దిల్షౌన్ (19)లు సిరియా వెళ్లేందుకు 'హనీమూన్' ప్లాన్ చేసుకున్నారు. తొలుత గ్రీస్, ఆపై టర్కీ, అక్కడి నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని బయలుదేరగా, మిసిసిపి విమానాశ్రయంలో వీరిని ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది. ఐఎస్ఐఎస్ వైపు అమెరికన్ యువత ఆకర్షింపబడకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అండర్ కవర్ ఫెడరల్ ఏజంట్లు వీరి ఉద్దేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పసిగట్టారని అధికారులు వివరించారు. వీరిద్దరికీ బెయిల్ ఇచ్చేది లేదని ఆక్స్ ఫర్ట్ న్యాయమూర్తి అలాన్ అలెగ్జాండర్ తేల్చి చెప్పారు. జూన్ 6న వివాహం చేసుకున్న వీరిద్దరూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్స్ తో సంబంధాలు నడిపారని ఫెడరల్ అధికారులు తెలిపారు.