: దేశ రాజకీయాల్లో ఇక కాంగ్రెస్ ఒంటరేనా?
ఒకటిన్నర సంవత్సరం క్రితం వరకూ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒంటరయిందా? పార్లమెంటులో కలిసొచ్చే వారు లేక డీలా పడిపోతోందా? పరిస్థితులు అవుననే అంటున్నాయి. యూపీఏ కూటమిలో కీలక పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్ తదితరాలు కాంగ్రెస్ కు దూరం జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న పార్లమెంటులో చేసిన గొడవ చాలని సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ కు క్లాస్ పీకి బీజేపీకి దగ్గరయ్యేందుకు అభ్యంతరాలు లేవన్న సంకేతాలు పంపారు. ఇలాగే చేస్తే, ఆ పార్టీతో కలసిరాబోమని కూడా హెచ్చరించారు. దీనికి ప్రతిగా స్వయంగా ప్రధాని మోదీ ములాయంను అభినందించారు కూడా. ఇక నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ సంచలనం సృష్టించేలా, ఢిల్లీ వేదికగా నేటి సాయంత్రం పలు పార్టీలతో టీపార్టీ, ఆపై విందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకుండా చూడటమే లక్ష్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ, జనతాదళ్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల ప్రముఖులు ఈ 'చాయ్ పే చర్చ'కు హాజరుకానున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ విందు ఏర్పాట్లను తృణమూల్ పర్యవేక్షిస్తుండటంతోనే కాంగ్రెస్ కు ఆహ్వానం వెళ్లలేదని తెలుస్తోంది. బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు రానున్న తరుణంలో అక్కడ తమకు పోటీగా నిలిచే కాంగ్రెస్ ను, ఈ సమావేశానికి పిలవకూడదని మమత నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక బీహారులో తృణమూల్ పోటీ చేయనప్పటికీ, ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె సలహా సూచనలు ఇస్తారని సమాచారం. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చరాదన్న ఉద్దేశంతో బీహార్ లో తమ అభ్యర్థులను నిలపబోమని ఇప్పటికే ఆమ్ ఆద్మీ స్పష్టం చేసింది.