: తెలంగాణలో రూ. 30కి క్వార్టర్... రూ. 1200 కోట్లు నష్టపోతూ 'అఫర్డబుల్' మద్యం తెస్తున్న సర్కారు
గుడుంబాకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ, చౌకమద్యాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించిన కేసీఆర్ సర్కారు ఖజానాకు సాలీనా రూ. 1200 కోట్ల నష్టం వస్తుందని అధికారులు లెక్కలు కట్టారు. ప్రజలకు అందుబాటు ధరలో మద్యాన్ని విక్రయిస్తే, వారు గుడుంబా జోలికి పోకుండా ఉంటారన్నది ప్రభుత్వ అభిమతం. రూ. 60 విలువైన లిక్కర్ పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) తదితరాలను తొలగించి క్వార్టర్ (180 మి.లీ.) బాటిలును రూ. 30కి, 90 ఎం.ఎల్ బాటిలును రూ. 15కు విక్రయించాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం టీఎస్ ఆబ్కారీ శాఖ ఆదాయం సాలీనా రూ. 10,500 కోట్లుగా ఉండగా, గుడుంబాను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఎంత ఆదాయం తగ్గినా ఫర్వాలేదన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులు చేసే అల్పాదాయ వర్గాలకు తక్కువ ధరకు ఆమోదయోగ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచితే, వారు గుడుంబా జోలికి వెళ్లరని ప్రభుత్వం నిర్వహించిన సర్వే తేల్చడంతో, ఇలా ప్రభుత్వమే 'అఫర్డబుల్ లిక్కర్' వైపు అడుగులేస్తోంది.