: ఇస్తే ప్రత్యేకహోదా ఇవ్వండి...లేదా ప్రత్యేక దేశంగా వెలివేయండి: సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కు ఇస్తే ప్రత్యేకహోదా ఇవ్వాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దేశంగా వెలివేయాలని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నేడు చేబట్టిన బంద్ పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంద్ విజయవంతమైందని అన్నారు. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారని ఆయన తెలిపారు. పార్టీలు, నేతలకతీతంగా స్పందించిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకహోదాను అడ్డుకున్న పాపంలో రాష్ట్రానికి చెందిన నేతలు ఎవరూ పాలుపంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హోదాను ఇవ్వని పాపం మోదీ, బీజేపీకి వదిలేద్దామని ఆయన సూచించారు. 5 కోట్ల మంది ఆంధ్రులు కోరుతున్న ప్రత్యేకహోదాను ఇవ్వని పక్షంలో తమను ప్రత్యేకదేశంగా వెలివేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది సంతోషంగా లేరని, అలాంటప్పుడు ఈ వేడుకలెందుకు? అని శివాజీ ప్రశ్నించారు. తమ జీవితాలు, తమ భావితరాల జీవితాలు సంతోషంగా లేనప్పుడు, తమకు స్వాతంత్ర్యం దక్కనప్పుడు ఎవరికోసం ఈ దేశంలో ఉండాలని శివాజీ నిలదీశారు. భారతీయులుగా పుట్టిన తమను కొంత మంది భారతీయులే మోసం చేసినప్పుడు... ఏ భరతమాత పేరు చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. స్వార్థాలు పక్కన పెట్టి నేతలంతా ప్రత్యేకహోదా కోసం పని చేయాలని శివాజీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ఆందోళన ప్రత్యక్షంగా చూసిన తాను ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని శివాజీ తెలిపారు.