: మార్కెట్ కొంపముంచిన పార్లమెంట్!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నెలకొన్న స్తంభన మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించివేసింది. మరో రెండు రోజుల్లో లోక్ సభ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందే అవకాశాలు లేవని తెలుసుకున్న మార్కెట్ వర్గాలు అమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచికలు భారీగా నష్టపోయాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, నిమిషాల వ్యవధిలో నష్టాల్లోకి జారిపోయింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచి 235.63 పాయింట్లు నష్టపోయి, 0.84 శాతం నష్టంతో 27,866.09 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచి 63.25 పాయింట్లు పడిపోయి 0.74 శాతం నష్టంతో 8,462.35 పాయింట్ల వద్దా కొనసాగాయి. ఎన్ఎస్ఈ-50లో 37 కంపెనీలు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జీ ఎంటర్ టెయిన్ మెంట్, టీసీఎస్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హిందాల్కో, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.46 శాతం, స్మాల్ కాప్ 1.13 శాతం దిగజారాయి.