: సరిపోయే డ్రెస్సు కోసం లక్ష్మణ్ సాయం కోరిన ద్రావిడ్


చెన్నైలోని మద్రాస్ క్రికెట్ క్లబ్ లో సోమవారం మాజీ క్రికెటర్లతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దిగ్గజ క్రికెటర్లకు గౌరవ సభ్యత్వం అందించారు. కాగా, ఈ కార్యక్రమానికి భారత బ్యాటింగ్ ఐకాన్లు రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్రావిడ్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి ఫార్మల్ డ్రెస్సులే ధరించి రావాలని నిర్వాహకులు స్పష్టం చేశారట. "నా వద్ద టీషర్టులు, జీన్సు ప్యాంట్లే ఉన్నాయి. నాకు సరిపోయే దుస్తుల కోసం లక్ష్మణ్ కు తప్ప ఇంకెవరికి ఫోన్ చేయను? వెంటనే లక్ష్మణ్ కు ఫోన్ చేసి టై, బ్లేజర్ కావాలని చెప్పాను. సీన్ కట్ చేస్తే, ఇదిగో ఇలా మీ ముందు ఫార్మల్స్ లో కనిపిస్తున్నా" అని వివరించాడు ఈ విషయంలోనే కాదని, జట్టుకు ఎప్పుడు అవసరమైనా, నేనున్నానంటూ లక్ష్మణ్ ముందుకొచ్చేవాడని ద్రావిడ్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రావిడ్... 2001లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాతో టెస్టులో తామిరువురు నెలకొల్పిన 376 పరుగుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. అది చారిత్రాత్మకమని అభివర్ణించాడు. "ఆ టెస్టుకు సంబంధించిన డీవీడీ నా వద్ద ఉంది. అయితే దాన్ని ఎప్పుడూ తిలకించలేదు. ఆ ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ బ్యాటింగ్ చూసి ఎంత ఇబ్బందికరంగా ఫీలయ్యాను! షేన్ వార్న్ లెగ్ స్టంప్ ఆవల పిచ్ చేసిన బంతిని లక్ష్మణ్ కవర్స్ దిశగా నమ్మశక్యం కాని రీతిలో షాట్ కొట్టాడు. ఆ షాట్ చూసిన తర్వాత లక్ష్మణ్ ముందు నేనెంతో అల్పుడిని అన్న భావన కలిగింది. లక్ష్మణ్ తన అమోఘమైన ఆటతో నాలో అలాంటి భావన రేకెత్తించాడు" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News