: సిలికాన్ వ్యాలీలో టెక్ ఉద్యోగార్థులకు ఎదురైన ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసా?
ప్రపంచ ఐటీ రంగానికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినవారికి ఎదురైన ప్రశ్నల్లో కొన్ని సిల్లీ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అభ్యర్థి స్పాంటేనియస్ స్పందన ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకే ఈ తరహా ప్రశ్నలను సంధిస్తారు. అటువంటి వాటిల్లో కొన్ని ఇవి. * భూమి గుండ్రంగా ఎందుకుంది? (ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం కోసం 'ట్విట్టర్' అడిగిన ప్రశ్న) * నీ పేరు పక్కన ఓ తోక ఉందనుకో... దాని గురించి ఏమి చెబుతావు? (అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టు కోసం 'యాహూ' వేసిన ప్రశ్న) * శాన్ జోస్ లో ఎన్ని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి? (క్వాలిటీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ పోస్టు కోసం 'అడోబ్' వేసిన ప్రశ్న) * సియాటెల్ లో ఉన్న అన్ని కిటికీలనూ శుభ్రం చేయాలంటే ఎంత కూలీ తీసుకుంటావు? (ఆన్ లైన్ సేల్స్ ఆపరేషన్స్ పోస్టుకు 'ఫేస్ బుక్' సంధించిన ప్రశ్న) * నిద్రలేచేసరికి 2 వేల ఈ-మెయిల్స్ వచ్చాయి. వాటిల్లో 300 మాత్రమే చూడగలిగితే, ఏ మెయిల్స్ చూస్తావు? (రొటేషన్ ప్రోగ్రామ్ పొజిషన్ కు 'డ్రాప్ బాక్స్' వేసిన ప్రశ్న) * విమానం కూలి నువ్వొక్కడివే బతికితే ఏం చేస్తావు? (ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ కు 'ఎయిర్ బీఎన్బీ' వేసిన ప్రశ్న) * ప్రతి రోజూ ప్రపంచంలో ఎంతమంది పుడుతున్నారు? (గ్లోబల్ సప్లయ్ మేనేజర్ పొజిషన్ కు 'యాపిల్' అడిగిన ప్రశ్న) * నువ్వోక చెట్టుగా మారాలంటే, ఏ చెట్టుగా అవుతావు? (సీనియర్ టెక్నికల్ రైటర్ పోస్టుకు 'సిస్కో' అడిగిన ప్రశ్న) * రెండు సూపర్ పవర్ లలో (మాయం కావడం, గాల్లో ఎగరడం) ఒకటి కోరుకోమంటే ఏది కోరుకుంటావు? (హై లెవల్ ప్రొడక్ట్ లీడ్ పోస్టు కోసం 'మైక్రోసాఫ్ట్' వేసిన ప్రశ్న) * వెయ్యేళ్ల పాటు బతికేవారితో కలసి పనిచేయాల్సి వస్తే ఏం చేస్తావు? (కంటింజంట్ వర్క్ ఫోర్స్ లో ఉద్యోగార్థికి 'లింకెడ్లిన్' అడిగిన ప్రశ్న) ఈ తరహా ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పామన్నది ముఖ్యం కాదు. ఎంత వేగంగా చెప్పామన్నది, ఎంత వాస్తవికతకు దగ్గరగా ఉందన్నదే ముఖ్యం.