: నెస్లేపై రూ. 400 కోట్లకు దావా వేయనున్న మోదీ సర్కారు
మ్యాగీ నూడుల్స్ విషయంలో నిజాలు దాచి, తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చి జాతి ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిందని ఆరోపిస్తూ, నెస్లే సంస్థపై రూ. 400 కోట్లకు దావా వేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. దావా వేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్ర కన్స్యూమర్ అఫైర్స్ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆమోదం తెలిపారని సమాచారం. అయితే, ఎంతమేరకు నష్ట పరిహారాన్ని కోరాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, భారత కేంద్ర ప్రభుత్వం ఇలా ఓ సంస్థపై ప్రజల తరపున దావా వేయాలని భావించడం ఇదే తొలిసారి. మ్యాగీ ఉత్పత్తుల్లో సీసం తదితర రసాయనాలు నిర్ణీత ప్రమాణాల కన్నా అధికంగా ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో, జూన్ 6న దేశవ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మ్యాగీ వార్షిక అమ్మకాలను అనుసరించి ఎంత మొత్తం దావా వేయాలన్న విషయాన్ని లెక్కిస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.