: ఈ రాత్రి మమతా బెనర్జీతో కలసి డిన్నర్ చేయనున్న కేజ్రీవాల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలసి ఈ రాత్రి విందు భోజనం ఆరగించనున్నారు. మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో ఈ కార్యక్రమం చోటు చేసుకోనుంది. కేజ్రీవాల్ గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో అన్నీ శాకాహార వంటకాలే ఉండబోతున్నాయని సమాచారం. అయితే, ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ కు మద్దతుగానే మమత ఈ విందును ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీపై కేజ్రీవాల్ కు అమితమైన గౌరవం ఉంది. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని ఎంత మాత్రం భరించమని మమతతో పాటు కేజ్రీవాల్ కూడా గతంలో బీజేపీ ప్రభుత్వంపై ఏకంగా యుద్ధం చేసినంత పనిచేశారు. ఈ క్రమంలో మమత అంటే కేజ్రీవాల్ కు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అయితే, ఈ విందు కార్యక్రమానికి ఎలాంటి ప్రత్యేకత లేదని, కేవలం గౌరవ పూర్వకంగా జరుగుతోందని అధికారులు తెలపడం కొసమెరుపు. మరోవైపు, ప్రధాని మోదీతో మమత రేపు భేటీ కానున్నారు.