: ఎల్ఓఎల్, హాహా, ఎమోజీ... ఆన్ లైన్లో ఎవరెంత నవ్వుతారంటే!
నవ్వు ఎన్నో రకాలు. ఒకరు పగలబడి నవ్వితే, మరొకరు చిరునవ్వు నవ్వుతారు. ఇంకొకరు ముసిముసిగా నవ్వుతారు. ఇదంతా బయటకు కనిపిస్తుంది. ఈ టెక్ ప్రపంచంలో చాటింగ్, మెసేజింగ్ సర్వసాధారణమై పోగా, నవ్వును ఎదుటివ్యక్తికి తెలిపేందుకు సంక్షిప్త సందేశాలు, 'స్మైలీ' సింబల్సే దిక్కయ్యాయి. 'ఎల్ఓఎల్-లాఫింగ్ ఔట్ లౌడ్లీ' (బిగ్గరగా పగలబడి నవ్వడం), 'హెచ్ఏహెచ్ఏ- హహ్హా' (చిరునవ్వు), 'హెహ్హెహే-హెచ్ఈహెచ్ఈ' (వెకిలినవ్వు), 'ఎమోజీ' (చిద్విలాస నవ్వు) ఇలా ఎన్నో రకాలుగా తమ భావాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఈ నేపథ్యంలో, నెటిజన్లలో ఎవరు ఎలా నవ్వుతారు? ఎటువంటి నవ్వును ఎక్కువగా నవ్వుతారన్న విషయమై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ ఆసక్తికరమైన సర్వేను నిర్వహించింది. ఈ వివరాల ప్రకారం నెట్లో బిగ్గరగా పగలబడి నవ్వేవారి సంఖ్య, అంటే 'ఎల్ఓఎల్'ను ఎంచుకునే వారి సంఖ్య 1.9 శాతం మాత్రమే. చిరునవ్వు 'హెచ్ఏహెచ్ఏ' నవ్వుతున్నామని చెప్పేవారి సంఖ్యే అత్యధికంగా 51.4 శాతంగా ఉంది. ఇక 'ఎమోజీ' అని మెసేజ్ చేసే వారి సంఖ్య 33.7 శాతం కాగా, 'హెచ్ఈహెచ్ఈ' అనేవారి సంఖ్య 13.1 శాతంగా ఉందని ఫేస్ బుక్ తన సర్వే అనంతరం వెల్లడించింది. టీనేజర్లలో ఎక్కువమంది చిద్విలాస నవ్వు నవ్వుతుంటే, వయసుమళ్లిన వారిలో అత్యధికులు పగలబడి నవ్వుతున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.