: ఏపీలో దుబాయి పెట్రో కెమికల్ కాంప్లెక్స్... లక్ష కోట్ల పెట్టుబడి, 50 వేల ఉద్యోగాలు!


ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. దేశాలు చుట్టి వస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలకు ఏపీపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసిన చైనా మొబైల్ హ్యండ్ సెట్ దిగ్గజం జియోమీ చిత్తూరులోని శ్రీసిటీ నుంచి అతి తక్కువ కాలంలోనే ఉత్పత్తిని బయటకు తీసింది. ఈ ప్రోడక్ట్ ను నిన్న చంద్రబాబు విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. తాజాగా ఏపీలో భారీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు దుబాయికి చెందిన ఓ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం ఆ కంపెనీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముడి చమురు దిగుమతి, తుది ఉత్పత్తుల ఎగుమతి కోసం ఆ కంపెనీ సొంతంగా ఓడరేవు (పోర్టు)ను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా యోచిస్తోంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో 3 వేల ఎకరాల భూమిని కూడా కేటాయించాలని సదరు కంపెనీ ఏపీ సర్కారును కోరిందట. అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన నేపథ్యంలో భూమి లభ్యత కష్టంగా ఉండడంతో, ప్రకాశం జిల్లా భూములను పరిశీలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆ కంపెనీ సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. ఈ కంపెనీ ఏర్పాటైతే దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి వస్తాయని సమాచారం.

  • Loading...

More Telugu News