: నైజీరియా జైల్లో వున్న తండ్రిని విడిపించాలంటూ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానంటున్న తనయ!


నైజీరియా ప్రభుత్వం అరెస్టు చేసిన తన తండ్రిని విడిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని శ్రేయసి దాస్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన జోగేంద్రచంద్ర దాస్ నైజీరియాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో నావికుడుగా పని చేశారు. గతేడాది జూలైలో ఘనా నుంచి కామెరూన్ వెళ్తుండగా ఇంజిన్ లో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న షిప్ మునిగిపోయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు షిప్పింగ్ కంపెనీ జోగేష్, మరో పది మందిపై కేసు పెట్టింది. దీంతో నైజీరియా పోలీసులు జోగేంద్ర దాస్ ను అరెస్టు చేశారు. దీనిపై భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జోగేంద్ర కుమార్తె శ్రేయసి దాస్ ఆరోపించారు. నైజీరియాలోని షిప్పింగ్ కంపెనీని అడిగితే 200 కోట్ల రూపాయలు చెల్లించి, జోగేంద్రను విడిపించుకోవచ్చని సమాధానమిస్తున్నారు. తన తండ్రిని విడిపించాలని కేంద్రం, రాష్ట్రపతిని కోరినా ఎటువంటి ఫలితం లేదని శ్రేయసి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని విడిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని శ్రేయసి తెలిపారు.

  • Loading...

More Telugu News