: భక్తులతో కలిసి డిస్కో డ్యాన్సు చేసి, కోడళ్లను మీడియాకు పరిచయం చేసిన రాధే మా
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ మళ్లీ ముంబయిలో అడుగుపెట్టారు. కొన్ని రోజల తర్వాత ముంబయిలోని తన ఆశ్రమానికి చేరుకున్న ఆమె భక్తులతో కలిసి ఉత్సాహంగా డిస్కో తరహా నృత్యాలు చేశారు. తనకిష్టమైన ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన రాధే మా ఆటపాటలతో భక్తులను అలరించారు. కొందరు భక్తిపారవశ్యం ఎక్కువై ఆమెను ఎత్తుకుని డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఓ జాతీయ వార్తా చానల్ తో రాధే మా ప్రత్యేకంగా మాట్లాడారు. తనపై వరకట్నం కేసు దాఖలు చేసిన నిక్కీ గుప్తా ఓ విషయం తెలుసుకోవాలని అన్నారు. తన కోడళ్ల నుంచి తాను ఏమీ తీసుకోలేదని, వారు రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారని తెలిపారు. అలాంటిది, తినడానికి తిండి కూడాలేని ఓ పేద వ్యక్తి నుంచి ముడుపులు ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరి నుంచి హెలికాప్టర్, లగ్జరీ వస్తువులను డిమాండ్ చేయలేదని కూడా స్పష్టం చేశారు. అటు, భక్తులు కూడా ఆమెకే వత్తాసు పలికారు. రాధే మా డిమాండ్లేవైనా చేస్తారా? అన్న ప్రశ్నకు అందరూ ముక్తకంఠంతో 'నో' అని బదులిచ్చారు. అంతకుముందు, రాధే మా తన కోడళ్లు మేఘ, మనీషాలను మీడియాకు పరిచయం చేశారు. తన చిన్న కుమారుడు ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్నాడని, సినిమాల్లో నటిస్తున్నాడని తెలిపారు.