: ఐఎస్ మిలిటెంట్ గ్రూపుకూ విజన్ 2020 ఉంది... అందులో భారతదేశానికీ చోటుంది!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు కేవలం మధ్యప్రాచ్యంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలపై పెత్తనం చెలాయించాలని ఆశిస్తోంది. 2020 నాటికి తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. పశ్చిమాన స్పెయిన్ నుంచి తూర్పున చైనా వరకు తన జెండా రెపరెపలాడాలన్నది ఐఎస్ లక్ష్యమని తెలుస్తోంది. ఓ కొత్త పుస్తకంలో పొందుపరిచిన మ్యాప్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో మద్య ప్రాచ్యం సహా ఉత్తర ఆఫ్రికా, భారత ఉపఖండం, యూరప్ లోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించడం ద్వారా పరిపూర్ణ ఖలీఫా సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని ఐఎస్ భావిస్తోంది. హోస్కెన్ అనే రిపోర్టర్ రాసిన 'ఎంపైర్ ఆఫ్ ద ఫియర్: ఇన్ సైడ్ ద ఇస్లామిక్ స్టేట్' అనే పుస్తకంలో ఈ మ్యాప్ ను పొందుపరిచారు. ఖలీఫా సామ్రాజ్య స్థాపన పూర్తయ్యాక, ఐఎస్ తక్కిన ప్రపంచ దేశాలను లక్ష్యంగా చేసుకుంటుందని హోస్కెన్ వివరించారు.