: ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించలేదు: టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించలేదని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ, ఏపీలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రత్యేకహోదాను వాడుకుంటున్నాయని ఆరోపించారు. తాము రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏదీ లేదని, కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని వారు స్పష్టం చేశారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే ప్రత్యేకహోదా సాధిస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. షెడ్యూల్ 9, 10లో పేర్కొన్నట్టు సంస్థల విభజనలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని వారు ఆరోపించారు. హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు.