: భజరంగీ భాయ్ జాన్, శ్రీమంతుడు... భేష్!
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా అభిమానులను అలరిస్తూనే ఉంది. సినిమా విడుదలై నాలుగు వారాలు ముగిసినా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. రంజాన్ కానుకగా విడుదలైన 'భజరంగీ భాయ్ జాన్' నాలుగు వారాల్లో 310 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'భజరంగీ భాయ్ జాన్' తరువాత విడుదలైన అజయ్ దేవగణ్, టాబూ నటించిన 'దృశ్యం', రితేష్ దేశ్ ముఖ్ నటించిన 'భంగిస్తాన్' సినిమాలు ప్రేక్షకాదరణ పొందినప్పటికీ భజరంగీ భాయ్ జాన్ కలెక్షన్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కాగా, మహేష్ బాబు తాజా సినిమా 'శ్రీమంతుడు' విడుదలైన మూడు రోజుల్లోనే అమెరికాలో 13.18 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. దీంతో 'శ్రీమంతుడు' విడుదలైన మూడు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.