: 'అన్నా' పేరుందని చెన్నై వచ్చారు... వారి పాలిట వాకర్స్ నిజంగా దేవుళ్లే అయ్యారు!


ఇదో విచిత్రగాథ! ఆన్ లైన్ కౌన్సిలింగ్ లెటర్ లో వేదికను తప్పుగా అర్థం చేసుకుని ఓ విద్యార్థిని తల్లితో కలిసి చెన్నై చేరుకోగా, అక్కడ ఓ వాకర్స్ గ్రూపు నిజంగా దేవుళ్లే దిగివచ్చారన్న చందంగా అపూర్వరీతిలో సాయం చేసింది. వివరాల్లోకెళితే... తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన స్వాతి అనే అమ్మాయికి టీఎన్ఏయూ (తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ) కౌన్సిలింగ్ కు రమ్మని లేఖ అందింది. ఆ లేఖను స్వాతి తన ఫ్రెండు తల్లికి చూపింది. అందులో ఆంగ్లంలో పొందుపరిచిన వివరాలను తెలపమని ఆమెను కోరింది. ఆ లేఖలో... 'కౌన్సిలింగ్ వేదిక: అన్నా ఆరంగం' అని మాత్రమే ఉంది. నగరం పేరు లేదు. 'అన్నా' అని ఉంది కదా అని ఆ పెద్దావిడ చెన్నే లోని అన్నా యూనివర్శిటీ అనుకుని, ఆదే మాటను స్వాతితో చెప్పింది. దాంతో, లేఖలో పేర్కొన్న తేదీన తన తల్లితో కలిసి స్వాతి చెన్నైలో ఉన్న అన్నా యూనివర్శిటీకి చేరుకుంది. అక్కడ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పారు. కౌన్సిలింగ్ ఇక్కడ కాదు, కోయంబత్తూరులో అని వారు స్పష్టం చేయడంతో స్వాతి హతాశురాలైంది. దాంతో ఆమె అక్కడే కూలబడిపోయింది. అప్పుడు టైమ్ ఉదయం 8.30 గంటలు. కౌన్సిలింగ్ ఆరంభానికి రెండు గంటల సమయమే ఉంది. ఇక, తన కలలు కల్లలైపోయాయని ఎంతో వేదనతో తల్లితో కలిసి వర్శిటీ గేటు వద్ద తీవ్రంగా రోదిస్తున్న స్వాతిని అక్కడే వాకింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులు గమనించారు. వారు ఆమె వద్దకు వచ్చి విషయం ఏంటని ఆరా తీశారు. అంతా విని, ఆ యువతికి ఎలాగైనా సాయపడాలని నిశ్చయించుకున్నారు. ఆ క్షణాన నిజంగా వారు దేవుళ్లే! అదెలాగో చూడండి! వారిలో శరవణన్ అనే వాకర్ వర్శిటీ అధికారిని అడిగి కౌన్సిలింగ్ కోయంబత్తూరులోనే అని నిర్ధారించుకున్నారు. మిత్రులు పరమశివం, జైశంకర్ లతో కలిసి కోయంబత్తూరులో అధికారులను ఫోన్లో సంప్రదించాడు. స్వాతి విషయాన్ని వారికి వివరించగా, అధికారులు ఆమె కోసం వేచి చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో, ఓ సమస్య తీరినట్టయింది. ఇక, స్వాతిని ఆమె తల్లిని కోయంబత్తూరు చేర్చడమే మిగిలింది! రోడ్డు మార్గం అయితే చాలా సమయం పడుతుంది, అందుకోలేదు! దాంతో తమలో తాము ఆలోచించుకుని శరవణన్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే డబ్బులు పోగేసి, తల్లీకూతురికి ఫ్లయిట్ టికెట్లు బుక్ చేశారు. 10.30 గంటలకు వారిని ఫ్లయిట్ ఎక్కించారు. ఫ్లయిట్ ఎక్కేందుకు స్వాతి తల్లి భయపడినా వాకర్స్ గ్రూపు 'ఏమీ కాదమ్మా' అని భరోసా ఇచ్చింది. దాంతో, వారు విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఉరుకులు పరుగులు పెడుతూ కౌన్సిలింగ్ వేదిక వద్దకు చేరుకున్న స్వాతిని అధికారులు సానుభూతితో స్వాగతించారు. కౌన్సిలింగ్ లో ఆ చదువుల తల్లికి టీఎన్ఏయూలో బీఎస్ సీ బయోటెక్నాలజీలో సీటు వచ్చింది. దాంతో, ఆమె తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పొరబాటున తాము చెన్నై వెళ్లడంతో, ఇక అంతా అయిపోయిందని భావించామని, కానీ, కొందరు దయామయులు ఆదుకున్నారని కృతజ్ఞత నిండిన స్వరంతో చెప్పింది. అటు స్వాతికి సాయం చేసిన శరవణన్ కూడా కథ సుఖాంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అంతా ఓ కలలా అనిపిస్తోందన్నారు. కాగా, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన స్వాతిని తల్లి అంతా తానై పెంచింది. చదువులో ఎంతో ముందుండే స్వాతి ఎంబీబీఎస్ చేయాలని పరితపించినా, అనారోగ్యం కారణంగా అవసరమైన ర్యాంకు సాధించలేకపోయింది.

  • Loading...

More Telugu News