: విభజనకు కారణమే బాబు... ఇక హోదా ఏం తెస్తాడు?: వైఎస్ జగన్ మాటల తూటాలు


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, ఈ ఉదయం జంతర్ మంతర్ వద్ద దీక్షను ప్రారంభించిన వైఎస్ జగన్, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీపై, కేంద్రంలో మోదీ నేతృత్వంలో పాలన సాగిస్తున్న ఎన్డీయే సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆనాడు ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ ప్రతిపాదిస్తే, అది చాలదు, పదేళ్లు కావాలని గోల చేసిన వెంకయ్య నాయుడు ఈనాడు ఏమైపోయాడని ప్రశ్నించారు. రాష్ట్రం విభజనకు మూల కారణం చంద్రబాబు నాయుడు మాత్రమేనని జగన్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతిఒక్కరూ మోదీ ప్రధాని కాగానే ప్రత్యేక హోదా వస్తుందని భావించారని, ఇప్పుడా ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయని అన్నారు. ఆనాడు విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఓటేశారని, ఇప్పుడు పలు కేసుల్లో ఇరుక్కుని కేంద్రం కాళ్లు మొక్కుతున్న ఆయన, ఇక హోదా ఏం తేగలడని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయమై నిర్ణయాలు తీసుకునేందుకు 14వ ఆర్థిక సంఘానికి లేనేలేదని, ప్రభుత్వం తలచుకుంటే ఒక్క క్షణంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించేలా నిర్ణయాలు తీసుకునే అధికారమున్న ఎన్డీసీకి ప్రధాని అధ్యక్షుడిగా ఉన్నాడని, ఇక 14వ ఫైనాన్స్ కమిషన్ పై నెపం వేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తే వస్తే నష్టమేంటో చెప్పాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజల ఘోషను కేంద్రానికి వినిపించేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News