: కోమటిరెడ్డికి ఝలక్... అధికారిక కార్యక్రమానికి అధికారులు దూరం
ఇప్పటిదాకా అధికారిక కార్యక్రమాలకు విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వానించని ప్రభుత్వాలను చూశాం. కాని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ కొత్తరకం వివక్షకు తెర తీసింది. కోమటిరెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు కూడా డుమ్మా కొట్టారు. వివరాల్లోకెళితే... నల్లగొండలో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయ భవన సముదాయాన్ని కోమటిరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. సాధారణంగా ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న అధికారులంతా హాజరుకావాల్సి ఉంది. అంతేకాక ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా రావాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి విపక్షానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఆయనకు కొత్త రకం ట్రీట్ మెంట్ ఇచ్చే క్రమంలో ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరు కాలేదు. మంత్రులు ఈ కార్యక్రమానికి రాని నేపథ్యంలో అధికారులు కూడా ముఖం చాటేశారు. టీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే అధికారులు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.