: ఇండియాకు టెర్రర్ పుట్టించేందుకు లష్కరే తోయిబా వేసిన కొత్త ప్లాన్ ఇదే!


పంజాబ్ లోని దీనానగర్, ఉధంపూర్ లలో దాడులు జరిపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జమ్మూ నుంచి బయలుదేరే విమానాలను హైజాక్ చేసి వివిధ జైళ్లలో ఉన్న 20 మంది మిలిటెంట్లను విడిపించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అటు అంతర్జాతీయ సరిహద్దుల వద్దా నిఘాను పెంచింది. ఇదే విషయమై కేంద్ర హోం శాఖ, జమ్మూ పోలీసు విభాగాన్ని హెచ్చరించిందని తెలుస్తోంది. ఇటీవల కాశ్మీరు లోయలో సైన్యం, పోలీసులు అదుపులోకి తీసుకున్న 20 మంది పాకిస్థానీ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోను విడిపించుకుపోవడమే వారి లక్ష్యమని ఇంటెలిజన్స్ వర్గాలకు తెలిసింది. జైళ్లలోని వారి విడుదలకై ఆత్మాహుతి దాడులు, విమానాల హైజాక్, భారీ ఎత్తున ప్రజలను బందీలుగా పట్టుకోవడం వంటి దారుణాలకు ఉగ్రవాదులు పాల్పడవచ్చని 'మెయిల్ టుడే' ఓ కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు వివిధ ప్రాంతాల్లోని వారికి లష్కరే తోయిబా నుంచి అనుమతులు వచ్చాయని కూడా తెలుస్తోంది. కాశ్మీరంతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వరకూ ఉగ్రవాదులు విస్తరించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News