: దోమ కాటుతో ఆ వృద్ధురాలికేమైందంటే...!
సెలవుల్లో సరదాగా గడుపుదామని కరీబియన్ దీవులకు విహార యాత్రకు వెళ్లిన లండన్ వృద్ధురాలు దోమ కాటుకు గురైంది. దోమ కాటు మామూలేగా అనుకుంటున్నారా? మనకైతే ఓకేకాని, ఆ వృద్ధురాలు ఏకంగా కంటి చూపును కోల్పోయిందట. కరీబియన్ దీవుల్లో దోమకాటుకు గురైన సదరు వృద్ధురాలు తొలుత చికున్ గున్యాకు గురైంది. ఆ తర్వాత ఏకంగా ఎడమ కంటి చూపును కోల్పోయింది. దీవుల్లో ఉండగానే అనారోగ్యానికి గురైన ఆమె వైద్యులను సంప్రదించగా, చికున్ గున్యా సోకిందని తేలింది. కొంతకాలం పాటు ఫ్లూ తరహా జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పులు బాధించినా... ఆ తర్వాత ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పినట్లుగానే కొంత కాలం తర్వాత నొప్పులన్నీ తగ్గిపోయాయని ప్రకటించిన ఆమె బోరుమన్నారట. అదేంటీ, రోగం తగ్గితే సంతోషించాలి గాని, బోరుమనడమేంటనేగా మీ డౌటు? చికున్ గున్యా వల్ల కంటిలోని నరం ఒకటి దెబ్బతిని ఆమె కంటి చూపే పోయిందట. అయితే చికున్ గున్యాతో కంటి చూపు పోవడం అరుదేనని లండన్ కు చెందిన ప్రవాస భారతీయ వైద్యుడొకరు తెలిపారు.