: రూపాయి మిగలడం లేదని వాపోతున్న మధ్యతరగతి ప్రజలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ పరపతి విధానాన్ని పలుమార్లు సమీక్షించి, ద్రవ్యోల్బణాన్ని (ఇన్ ఫ్లేషన్) తక్కువ స్థాయులకు చేర్చినా, ఆ ప్రయోజనాలు ప్రజలకు దగ్గర కావడం లేదు. ద్రవ్యోల్బణం తగ్గినా, తమకు ఎంత మాత్రమూ ప్రయోజనాలు దగ్గర కావడం లేదని భారతీయ గృహిణులు వాపోతున్నారు. గృహావసరాలను తీర్చడం పలు సవాళ్లు ఎదురయ్యేలా చేస్తోందని మహిళలు వాపోతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా అరకొరగా పెరిగే వేతనాల నుంచి సేవింగ్స్ కు ఏమీ మిగలడం లేదన్నది అత్యధికుల అభిప్రాయం. ప్రభుత్వం చూపిస్తున్న అధికార గణాంకాలు ద్రవ్యోల్బణం దిగివచ్చినట్టు చూపుతున్నప్పటికీ, తనకే ప్రయోజనాలూ దగ్గర కాలేదని ముంబైలోని గృహిణి శైలా పాయ్ అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయని, ప్రయాణాలు, రెస్టారెంట్ ట్రిప్స్, వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకు బతుకుతున్నామని ఆమె అన్నారు. మధ్యతరగతి కుటుంబ సంపాదనలో పిల్లల విద్య, ఆహార అవసరాలు, వైద్య ఖర్చులకే అత్యధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని, ఈ మూడింటి విషయంలో ఎంతమాత్రమూ ఖర్చు తగ్గలేదని ఆమె వాపోయారు. భవిష్యత్తులో ఈ మూడు విభాగాల్లో ధరల పెరుగుదల 10 శాతానికి మించి కొనసాగుతుందని భావిస్తున్నట్టు ఆమె వివరించారు. ఈ విషయంలో శైలా ఒంటరి కాదు. ఇండియాలో మిడిల్ క్లాస్ ప్రజలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. ఈ వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వినిమయ ద్రవ్యోల్బణం గణాంకాలు మూడు నెలల గరిష్ఠస్థాయిలో 10.1 శాతానికి చేరాయి. 2013 తరువాత కన్స్యూమర్ ఇన్ ఫ్లేషన్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. పెరుగుతున్న జీవన వ్యయం: 2013లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణంపై దృష్టిని సారించారు. ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం మధ్య నిలపాలని గట్టిగా కృషి చేసి విజయం సాధించారు కూడా. గడచిన జూన్ లో ద్రవ్యోల్బణం 5 శాతానికి దిగి వచ్చింది. ఇదే సమయంలో ఈ సంవత్సరం పట్టణ ప్రాంతాల్లో వేతనాలు సైతం పెరిగాయి. అయితే, ప్రతిఒక్కరి మనసులో జీవనవ్యయం పెరుగుతోందన్న ఆలోచన మాత్రం తొలగలేదు. పైగా పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా వేతనాలు పెరగలేదన్న ఆందోళనా ఉంది. ముఖ్యంగా పిల్లల చదువులకు అవుతున్న ఖర్చు మిడిల్ క్లాస్ కు పెను భారమైంది. ఈ సంవత్సరం జూన్ లో ఎడ్యుకేషన్ కాస్ట్ ఏకంగా 7.23 శాతం పెరిగింది. మిగతా రంగాలతో చూస్తే అత్యధిక పెరుగుదల నమోదు చేసింది ఈ విభాగమే. పెరుగుతున్న మధ్యతరగతి ఖర్చులను నిశితంగా గమనిస్తున్నామని చెబుతున్న రాజన్, ఈ దిశగా సమస్య నివారణకు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.