: ఒకే కులం వారికి రూ.25 కోట్ల మేర కుచ్చుటోపీ... 'వేదగాయత్రీ అగ్రహారం' వెంచర్ అధినేత అరెస్ట్!
రియల్ ఎస్టేట్ మోసాలు కులాల ప్రాతిపదికన కూడా జరుగుతున్నాయి. ‘‘ఇక్కడ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఫ్లాట్లను విక్రయించబడును’’ అన్న ఒకే ఒక్క మాటతో అదే కులానికి చెందిన ఓ మాయగాడు చేతివాటం ప్రదర్శించాడు. హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్న ప్రభాకర శర్మ, మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం వెంకమ్మగూడలో ఓ వెంచర్ వేశాడు. అతడి నిజ స్వరూపం తెలియని వారు ఫ్లాట్ల కోసం బారులు తీరారు. 'వేదగాయత్రీ అగ్రహారం' పేరిట వేసిన వెంచర్ లో సుమారు 440 ఫ్లాట్లు ఉండగా, ఒకరికి తెలియకుండా మరొకరికి ఒకే ఫ్లాట్ ను విక్రయించేశాడు. అలా దాదాపు రూ.25 కోట్ల మేర వసూళ్లు రాబట్టాడు. జరిగిన మోసాన్ని కాస్త ఆలస్యంగా గమనించిన బాధితులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంచర్ లో జరిగిన విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మోసం జరిగిందని తేల్చారు. అనంతరం అతడిని నిన్న అరెస్ట్ చేశారు.