: ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్... చెన్నై ఆసుపత్రిలో చేరిన సఫారీ-ఏ జట్టు ఆటగాళ్లు
భారత్-ఏ జట్టుతో సిరీస్ కోసం ఇండియా వచ్చిన దక్షిణాఫ్రికా-ఏ జట్టు ఆటగాళ్లు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిపాలయ్యారు. నిన్న చెన్నైలో మ్యాచ్ జరుగుతుండగానే ముగ్గురు ఆటగాళ్లు ఆసుపత్రిలో చేరారని ఆ జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది. మొన్న నగరంలోని ఫీనిక్స్ మాల్ లో కొన్ని గంటల పాటు గడిపిన ఆ జట్టు ఆటగాళ్లు అక్కడే భోజనం చేసినట్లు సమాచారం. ఈ భోజనమే వారిని ఆసుపత్రి పాల్జేసిందని తెలుస్తోంది. శనివారం రాత్రే కొంతమంది అస్వస్థతకు గురి కాగా, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉన్నపళంగా ముగ్గురు ఆటగాళ్లు మైదానం వీడారు. ఇక సెంచరీ చేసిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ డికాక్, మ్యాచ్ ముగిసీ ముగియగానే ఆసుపత్రిలో చేరాడు. మొత్తం 10 మంది ఆటగాళ్లు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని ఆ జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది.