: ఢిల్లీ చేరిన జగన్ బృందం...మరికాసేపట్లో ఏపీకి ‘హోదా’ కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసనల పరంపర కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు దిగనున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ కూడా నిన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని అన్ని పక్షాలు కోరుతున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్రం సాచివేత ధోరణితో వ్యవహరిస్తుండగా, కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగానే జగన్ నేడు ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు.