: నాగార్జున వర్సిటీ వీసీ బదిలీ, బాబూరావు డిస్మిస్... కొరడా ఝుళిపించిన ఏపీ సర్కారు


ర్యాగింగ్ భూతానికి బలైన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై కాస్త ఆలస్యంగానైనా ఏపీ సర్కారు కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ పై ఫిర్యాదు అందినా స్పందించని బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుపై ప్రభుత్వం డిస్మిస్ అస్త్రాన్ని ప్రయోగించింది. బాబూరావును పూర్తిగా సర్వీసు నుంచి తొలగించింది. అంతేకాక ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక వర్సిటీలో కట్టుతప్పిన విద్యార్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ వర్సిటీ ఇన్ చార్జీ వైస్ ఛాన్సలర్ సాంబశివరావుపై బదిలీ వేటేసింది. ఆ స్థానంలో సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మిని నియమించారు. రిషితేశ్వరి ఘటనపై సమగ్ర విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పరిశీలించిన తర్వాతనే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న విశాఖలో చెప్పారు. రిషితేశ్వరి ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News