: ఇంకెంతకాలం ఈ ఆటవిక పాలన?: బీహార్ లో మోదీ
బీహారులో కొనసాగుతున్న ఆటవిక పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం గయలో పరివర్తన ర్యాలీ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మార్పు కావాలని బీహారీలు కోరుకుంటున్నారని, గూండారాజ్యాన్ని ఇంకెంత మాత్రమూ సహించే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ అభివృద్ధి పథంవైపు నడిపిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారని ఆయన విమర్శించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ప్రజలను మోదీ కోరారు. మీరు మద్దతిచ్చి, ఆశీర్వదిస్తే, బీహార్ ను 'బీమారీ' లేని రాజ్యంగా చేసి చూపిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా, సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. తాజమహల్ కి వచ్చే ప్రతి ఒక్క పర్యాటకుడూ బోధగయకు రావాలని కోరుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బీహార్ యువత విద్యావంతులని, ప్రతి రాష్ట్రంలో బీహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని మోదీ గుర్తు చేశారు. ఈ ర్యాలీకి మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హజరయ్యారు.