: 1999 తరువాత బంగారం ధరలో ఇటువంటి పతనం ఇదే తొలిసారి!

బులియన్ హిస్టరీలో 1999 తరువాత అంటే, 16 సంవత్సరాల తరువాత అతిపెద్ద ధరల పతనం నమోదైంది. గత శుక్రవారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, వరుసగా ఏడు వారాల పాటు ధరల పతనం నమోదైంది. ఇంతటి సుదీర్ఘ పతనం తరువాత ఇప్పట్లో బంగారం ధరలు కోలుకునే అవకాశాలు అత్యంత స్వల్పమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "బంగారం ధరల విషయంలో స్పష్టంగా తిరోగమనం కనిపిస్తోంది. స్థిరత్వం కూడా ఇప్పట్లో కనిపించేలా లేదు" అని బులియన్ విశ్లేషకుడు ఆండ్ర్యూ నీ అభిప్రాయపడ్డారు. గడచిన రెండు వారాల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,080 నుంచి 1,100 మధ్యలోనే కదలాడటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. మరోవైపు గోల్డ్ ఈటిఎఫ్ లో పెట్టిన పెట్టుబడులు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ఇక ఔన్సు బంగారం ధర 1,050 డాలర్ల కన్నా కిందకు వస్తే గత రెండు మూడేళ్ల నుంచి ఈటీఎఫ్ లు కొనుగోలు చేసిన వారంతా నష్టపోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఈ సంవత్సరం జూన్ లో 1,205 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర ఇప్పుడు 9 శాతం మేరకు పడిపోయిందని ఆయన గుర్తు చేశారు.