: పాక్ ఉగ్రవాది నవేద్ కు సాయపడిన భారతీయులు!
పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి గత వారం బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై సహ ఉగ్రవాదితో కలసి దాడి చేసి పట్టుబడిన నవేద్ యాకూబ్ అలియాస్ ఉస్మాన్ కు జమ్మూకాశ్మీర్ లోని కొందరు భారతీయులు సహకరించారట. ఈ ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు నవేద్ ను జమ్మూ నుంచి ఉధంపూర్ కు తీసుకొచ్చారు. తనకు సహకరించిన, ఆశ్రయం ఇచ్చిన వారిని నవేద్ గుర్తించగా, వారిని అరెస్ట్ చేశారు. పుల్వామా, కుల్గాం జిల్లాల్లో నవేద్ తలదాచుకున్న ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. నవేద్ ఇచ్చిన వివరాలతో దాదాపు 12 మందిని పోలీసులు విచారణకు పిలిచారు. పోలీసులు అరెెస్ట్ చేసిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులను కుల్గాం నుంచి ఉధంపూర్ కు తీసుకొచ్చిన ట్రక్ డ్రైవర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనితో పాటు లష్కరే తోయిబా సానుభూతిపరుడిగా ఉంటూ పుల్వామాలో బేకరీని నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నిస్తున్న మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.