: 28 రాష్ట్రాలు, 28 వారాలు, 28 ఉద్యోగాలు!
జుబనాష్వ మిశ్రా... భువనేశ్వర్ లో బీటెక్ చేశాడు. అహ్మదాబాద్ ఎంఐసీఏ నుంచి పీజీ కూడా పూర్తి చేశాడు. 52 వారాల్లో 52 ఉద్యోగాలు చేసిన కెనడియన్ సీన్ అయికిన్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ రికార్డుపై కన్నేశాడు. 28 వారాల్లో 28 రాష్ట్రాల్లో 28 ఉద్యోగాలు చేశాడు. హర్యానాలో ఫోటోగ్రాఫర్ గా, హిమాచల్ ప్రదేశ్ లో పర్వతాల్లో చెత్తను ఏరేవాడిగా, ఆంధ్రప్రదేశ్ లో ప్లే స్కూల్ టీచరుగా, జమ్మూలో నదీ ప్రాంతాల గైడ్ గా, ఒడిశాలో టీవీ చానల్ టీఆర్పీ రేటింగ్ విశ్లేషకుడిగా, కర్ణాటకలో కన్సల్టెంట్ గా, గోవాలో టాటూలు వేసే కళాకారుడిగా, తమిళనాడులో వేరుశనగలు అమ్ముకునేవాడిగా, ఇలా అన్ని రాష్ట్రాలూ తిరిగాడు. చివరికి శ్మశానంలో సహాయకుడిగా కూడా పనిచేశాడు. "కలలు కనేందుకు భయపడకూడదు. పెద్ద కలలు కని వాటిని నిజం చేసుకునేందుకు యత్నించాలి. మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారి మాటలు వినద్దు. మీ మనసు మాటలే వినాలి" అని యువతకు సలహా ఇస్తున్నాడు. యువత ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్న ప్రచారం కోసమే తానీపని చేస్తున్నట్టు మిశ్రా చెబుతున్నాడు.