: శివాజీ ముక్కు నుంచి రక్తం... పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన చానల్ యాంకర్


నటుడు శివాజీ ప్రత్యేక హోదాపై తన పంథాను మరోసారి స్పష్టం చేశారు. తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మాహుతికి యత్నించడంపై ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై ఆయన టీవీ9 స్టూడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయితే, ఈ సందర్భంగా శివాజీ ముక్కు నుంచి పదేపదే రక్తం కారింది. అది చూసి చానల్ యాంకర్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ప్రమాదమేమీ లేదంటూ శివాజీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రత్యేక హోదాపై తాను పోరాడుతుంటే క్రెడిట్ అంతా తనకే వస్తుందని కొందరు బాధపడుతున్నారని ఆరోపించారు. శివాజీకి క్రెడిట్ వస్తోందన్న టెన్షన్ తో సతమతమవుతున్నారని ఎద్దేవా చేశారు. తన నేతృత్వంలోనో, లేక, చలసాని నేతృత్వంలోనే అఖిలపక్ష కమిటీ వేసి ఢిల్లీ వెళదామంటే ఏ పార్టీ ముందుకు రాదని, ఆ విషయం తనకు తెలుసని అన్నారు. అందరూ దొంగలే అన్నారు. ఈ దొంగలు ఎప్పటికీ మారరని అర్థమైందని విమర్శించారు. అయితే మంచిదొంగకు ఓటేయక తప్పదని, వారి బాటలో నడవాల్సిందేనని అన్నారు. తనకు పబ్లిసిటీ అవసరంలేదని, ప్రత్యేక హోదాపై దీక్ష సందర్భంగా మరోరోజు దీక్ష కొనసాగించివుంటే తన కిడ్నీలు పాడయిపోయేవని తెలిపారు. క్రెడిట్ కోసమైతే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నారు.

  • Loading...

More Telugu News