: ఇప్పటిదాకా తానే దేవతన్నది... ఇప్పుడు దేవుడే దిక్కు అంటోంది!
భారత్ లో అతి తక్కువ వ్యవధిలోనే బాగా ఫేమస్ అయిన దైవదూత ఎవరంటే రాధే మా పేరే చెప్పుకోవాలి. కుటుంబ కష్టాల నేపథ్యంలో ముంబయి చేరిన ఆమె ఏ మాయ చేసిందో కానీ, ప్రజలు భక్తి పారవశ్యంతో గుడ్డిగా అనుసరించడం మొదలుపెట్టారు. ఆమె చెప్పిందే వేదం వారికి. ఇటీవల వరకు ఈ తంతు సాఫీగానే సాగింది. అయితే, ఇటీవల కురచ దుస్తుల్లో ప్రత్యక్షమైనప్పటి ఆమె ఫొటోలు మీడియాలో రావడం, వరకట్న వేధింపుల కేసులో ఇరుక్కోవడం వంటి ఘటనలు ఆమె ప్రతిష్ఠను మసకబార్చాయి. ఆమెపై నమోదైన వరకట్న వేధింపుల కేసు నేపథ్యంలో ఆమె ముంబయిని, భక్తులను వీడి ఔరంగాబాద్ చేరినట్టు తెలిసింది. మీడియా ఆమెను తాజా పరిణామాలపై ప్రశ్నించగా... దేవుడు తనకు న్యాయం చేస్తాడని కన్నీటి పర్యంతమైంది. సమస్యలపై తానేమీ మాట్లాడలేనని, అన్నీ ఆయనే చూసుకుంటాడని దేవుడిపై భారం వేసింది. కాగా, రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ పై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ నడుస్తోంది. భక్త వర్గం ఆమెపై కామెంట్లకు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పెళ్లయి, ముగ్గురు పిల్లలుండి ఇవేం పనులని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. అన్నట్టు... ఈవిడగారి అభిమాన తార సన్నీ లియోనట. ఆఫ్ ద ఫీల్డ్ లో ఆమెలాగా డ్రెస్సులు ధరించడానికి రాధే మా మొగ్గు చూపుతుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. భక్తులను గట్టిగా హత్తుకోవడం, చుంబించడమంటే ఈ స్వీయ ప్రకటిత దైవస్వరూపిణికి ఎంతో ఇష్టమట!