: రేవంత్ ‘మున్నాభాయ్’ వ్యాఖ్యలపై లక్ష్మారెడ్డి ఫైర్... ఒకే వేదికపై వాగ్వాదం


బాలీవుడ్ హిట్ మూవీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లో డాక్టర్ పట్టా పొందేందుకు హీరో చేసిన ఫీట్లు గుర్తున్నాయిగా? ప్రస్తుతం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి కూడా అలాంటి ఫీట్లతోనే డాక్టర్ డిగ్రీ సాధించారని టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై లక్ష్మారెడ్డి ఫైరయ్యారు. నేరుగా రేవంత్ రెడ్డినే ఆయన నిలదీశారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల వేదికలు రాజకీయ చర్చా వేదికలు కాదని రేవంత్ కూడా కాస్త గట్టిగానే బదులిచ్చారు. ఇందుకు పాలమూరు జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నిన్న ఏర్పాటైన ఓ అధికారిక కార్యక్రమం వేదికైంది. మద్దూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించేందుకు మంత్రి లక్ష్మారెడ్డి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి స్థానిక ఎమ్మెల్యే హోదాలో రేవంత్ రెడ్డి కూడా విచ్చేశారు. ఇరువురు నేతలూ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. ఇక తన ప్రసంగాన్ని మొదలెట్టిన లక్ష్మారెడ్డి, తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘నేను గుల్బర్గాలో డాక్టర్ డిగ్రీ పట్టా పొందాను. అనుమానం ఉంటే విచారణ చేసుకోవచ్చు. నా పట్టా తప్పని రుజువైతే రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు సిద్ధమా?’’ అని ఆయన రేవంత్ ను ప్రశ్నించారు. మంత్రి సవాల్ కు దీటుగా బదులిచ్చిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ చర్చా వేదికలు కాదని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం సరికాదని చెప్పారు. ఈ సందర్భంగా వేదికపైనే వారిరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.

  • Loading...

More Telugu News