: కేసీఆర్ పై పోరాడండి... అండగా నేనుంటా!: ఓయూ విద్యార్థులకు రాహుల్ భరోసా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూ విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిన్న ఢిల్లీలో ఓయూ విద్యార్థులు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాహుల్ తో భేటీ అయ్యారు. ఓయూలో జరగనున్న విద్యార్థి ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని వారు రాహుల్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించొద్దని రాహుల్ విద్యార్థులకు సూచించారు. ‘‘మీకు అండగా నేనుంటా’’ అంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? అని కూడా రాహుల్ బాధ పడ్దారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదని నిందించారు. త్వరలోనే ఓయూకు వస్తానని రాహుల్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.