: చిన్నప్పుడు మా స్కూల్ కబడ్డీ జట్టు కెప్టెన్ ను నేనే!: ప్రొ కబడ్డీలో సందడి చేసిన వెంకయ్యనాయుడు
నానాటికీ ప్రేక్షకులను పెంచుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్... తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కూడా స్టేడియానికి రప్పించుకుంది. నిన్న హైదరాబాదులోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను వెంకయ్య తిలకించారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల స్థాయిలో కబడ్డీతో పాటు ఖో-ఖో ఆడేవాడినని పేర్కొన్న వెంకయ్య, స్కూల్ కబడ్డీ జట్టుకు తానే కెప్టెన్ గా వ్యవహరించానని చెప్పారు. ‘‘గ్రామీణ క్రీడ కబడ్డీకి గొప్ప ఆదరణ లభిస్తోంటే చాలా సంతోషంగా ఉంది. చదువుకునే రోజుల్లో కబడ్డీ, ఖో-ఖో ఆడేవాడిని. మా స్కూల్ కబడ్డీ జట్టుకు నేనే కెప్టెన్ ను. ప్రతి స్కూల్ లో కబడ్డీని తప్పనిసరి చేయాలి. రాజకీయాలకు, కబడ్డీకి దగ్గరి సంబంధం ఉంది. రాజకీయాల్లో రాణించాలంటే శారీరకంగానే కాక మానసికంగానూ బలంగా ఉండాలి. కబడ్డీకి కూడా అదే అవసరం. కబడ్డీలో క్రమశిక్షణ ఉంది. అయితే అది రాజకీయాల్లో కొరవడింది’’ అని వెంకయ్య అన్నారు.