: లంకేయులను కుప్పకూల్చిన ఇషాంత్... రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమైన రోహిత్, కోహ్లీ


కొలంబోలో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్ తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 351 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న 109 పరుగులతో నాటౌట్ గా ఉన్న రహానే ఈరోజు బ్యాటింగ్ కు దిగలేదు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బోర్డ్ టీమ్ ను ఇషాంత్ శర్మ కకావికలు చేశాడు. కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు ఇషాంత్. ఇషాంత్ బౌలింగ్ వాడికి శ్రీలంక బోర్డ్ జట్టులోని టాప్ 6 బ్యాట్స్ మెన్లలో ఐదుగురు పెవిలియన్ చేరారు. ఇందులో నలుగురు డకౌట్ కావడం విశేషం. మొత్తమ్మీద శ్రీలంక బోర్డ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు 230 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఓపెన్ చేశారు. అయితే, మరోసారి పేలవమైన ఆటతీరుతో వీరిద్దరూ నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులకు, కోహ్లీ 18 పరుగులకు పెవిలియన్ చేరారు. వన్ డౌన్ లో వచ్చిన సాహా కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 28 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (4), లోకేష్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు.

  • Loading...

More Telugu News