: ‘అనంత స్వర్ణమయం’కు మంగళం!... నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ ఈఓ
తిరుమల వెంకన్న ఆలయానికి బంగారం తాపడం కోసం ఆర్భాటంగా ప్రకటించిన ‘అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళం పాడింది. 2008లో అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న డీకే ఆదికేశవులు నాయుడు అనంత స్వర్ణమయం బృహత్పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయన పిలుపు మేరకు నాడు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చిన భక్తులు, 200 కిలోల బంగారాన్ని వెంకన్నకు కానుకగా ఇచ్చారు. పథకానికి అవసరమైన బంగారం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అదే ఏడాది సెప్టెంబర్ 1న ఈ పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఆదికేశవులు నాయుడు చైర్మన్ పదవీ కాలం ముగియడం, తదనంతరం వచ్చిన చైర్మన్లు దానిని పట్టించుకోకపోవడంతో పథకం అమలు అటకెక్కింది. ఈ క్రమంలో నాడు తాము కానుకగా ఇచ్చిన బంగారాన్ని ఏం చేశారంటూ భక్తుల నుంచి టీటీడీకి ఫిర్యాదులందాయి. అంతేకాక కొంతమంది దీనిపై సుప్రీంకోర్టు గడపతొక్కారు. సుప్రీంకోర్టు కూడా ఈ పథకానికి ముగింపు పలకాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం టీటీడీ ఈఓ సాంబశివరావు ప్రకటించారు. అంతేకాక భక్తులు సమర్పించిన బంగారం గురించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు.