: అక్కడ 70ఏళ్ల లోపు వారు పుట్టినరోజు పార్టీలు చేసుకోకూడదు!
ఈ కాలంలో పలు పండుగల కంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజునే భారీ ఎత్తున జరుపుకోవడం చూస్తున్నాం. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిని పిలిచి మరీ భారీ పార్టీలు చేసుకుంటారు. ఈ పేరుతో పెట్టే ఖర్చులు కూడా మితిమీరాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ అనే రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 70 ఏళ్ల లోపు వారు పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదని నిషేధం విధిస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయితే 70 సంవత్సరాలు నిండిన వారు పదేళ్లకు ఒకసారి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవచ్చని తెలిపింది. తమ దేశ ప్రజలు పుట్టినరోజు పార్టీల పేరుతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడంవల్లే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర అధికారులు అంటున్నారు. పార్టీల్లో అతిథుల గౌరవమర్యాదల కోసం ఎక్కువ డబ్బు పెట్టడంవల్ల కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. అటు అతిథులకు కూడా బహుమతులు ఇచ్చే విషయంలో భారం పడుతోందని, ఈ క్రమంలో కుటుంబ పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితిని రక్షించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఈ నిర్ణయంపై పలువురు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.