: ఐ మిస్ యూ... జితేందర్ అనే వ్యక్తికి రిషితేశ్వరి మెసేజ్!: ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరిన దర్యాప్తు
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సీనియర్ల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు యువకులతో పాటు ఓ విద్యార్థినిని అరెస్ట్ చేశారు. తాజాగా జితేందర్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఆత్మహత్యకు ముందు రిషితేశ్వరి అతడితో చాలా సేపు చాటింగ్ చేసిందట. చాటింగ్ సందర్భంగా అతడికి ‘ఐ మిస్ యూ’ అంటూ మెసేజ్ పంపిందట. ఎందుకు మిస్సవుతున్నావన్న జితేందర్ ప్రశ్నకు స్పందించిన రిషితేశ్వరి, తాను ఇకపై బిజీగా మారుతున్నానని కూడా పేర్కొందని తెలుస్తోంది. ఇక రిషితేశ్వరి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ పై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఖను రిషితేశ్వరే రాసిందా? లేక వేరే ఎవరైనా రాశారా? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ తో పాటు ఆమె వాడిన ట్యాబ్ ను కూడా పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపారు. పోలీసులు అడిగిన మేరకు సమగ్ర నివేదికను త్వరలోనే అందజేస్తామని ఫోరెన్సిక్ నిఫుణులు తెలిపారని సమాచారం.