: ప్రతిమ రూపంలో పుట్టబోయే శిశువు... ముందే చూపెడుతున్న లండన్ ఆసుపత్రి
తల్లి గర్భంలో ఉండగానే శిశువు ఎలా ఉంటుందో చూపెడుతోంది లండన్ లోని లాంక్ షైర్ లో ఉన్న 'బేబీ బూ' ఆసుపత్రి. 2డీ, 3డీ, 4డీ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ లో ఈ ఆసుపత్రి బాగా ప్రసిద్ధి చెందింది. దాంతో బిడ్డ ఎలా ఉంటుందో అచ్చం అటువంటి ప్రతిమనే సృష్టించి తల్లుల చేతుల్లో పెడుతూ ఆశ్చర్యపరుస్తోంది. తల్లి గర్భంలో పిండం పూర్తి స్థాయి శిశువుగా మారేందుకు 28 వారాలు పడుతుందని, ఆ సమయంలో తమ వద్దకు వచ్చే తల్లులకు స్కానింగ్ చేస్తామని ఆసుపత్రి యజమాని కేటీ కెర్మోడ్ తెలిపారు. 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బిడ్డ ప్రతిమను రూపొందిస్తామన్నారు. దాంతో పుట్టిన తరువాత బిడ్డకు, తాము ముందుగానే రూపొందించిన బిడ్డ ప్రతిమకు పోలికల్లో ఏ మాత్రం తేడా ఉండదని కేటీ ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతానికి తల, మెడవరకున్న ప్రతిమలను మాత్రమే తయారు చేస్తున్నామన్నారు. బాడీ మొత్తం కావాలంటే 16వ వారంలో ఒకసారి, 28వ వారంలో ఒకసారి ఆసుపత్రికి రావాల్సి ఉంటుందన్నారు. స్కానింగు చార్జి కాకుండా, బేబీ ప్రతిమకు 15 వేల రూపాయలు చార్జ్ చేస్తామని ఆమె చెప్పారు. తనకు రెండు సార్లు గర్భస్రావం అవడంవల్లే ఈ సరికొత్త ఆలోచన వచ్చినట్టు కేటీ వెల్లడించారు. అయితే బిడ్డ ప్రతిమను అందంగా అలంకరించిన బాక్సులో లేదా గోడకు వేలాడదీసుకునేందుకు వీలుగా... ఎలా కోరుకుంటే అలా తయారుచేస్తామని ఆమె వివరించారు. ఈ ఆసుపత్రిలో తొలిసారి ఇలాంటి బిడ్డ ప్రతిమను తయారు చేయించుకున్న లేలా మ్యాక్ మిలన్ అనే మహిళ చాలా సంతోషం వ్యక్తం చేశారు. బిడ్డ ప్రతిమను చూసుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు.