: ఏపీ సెక్రటేరియట్ ఫోన్లూ ట్యాప్...జపాన్, సింగపూర్ ప్రతినిధులతో ఏపీ సంభాషణలు కూడానట!
ఓటుకు నోటు కేసులో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వివాదంలో రోజులు గడిచే కొద్దీ సంచలనాత్మక విషయాలు బయటకొస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఆయన చుట్టూ ఉండే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందన్న విషయం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, అటు దేశవ్యాప్తంగానూ కలకం సృష్టించింది. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు జరిపిన ఏపీ సీఐడీ అధికారులు మరిన్ని విస్తుగొలిపే వివరాలను వెలికితీశారు. చంద్రబాబు అధికారిక ఫోన్లతోనే సరిపెట్టని తెలంగాణ ఏసీబీ, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను కూడా విన్నదని ఏపీ సీఐడీ అధికారులు దాదాపుగా నిర్ధారించారు. మరోవైపు చంద్రబాబు ఫోన్లనే కాక ఏపీ సచివాలయంలోని పలు కీలక నెంబర్ల నుంచి వెళ్లిన, వచ్చిన కాల్స్ నూ తెలంగాణ ప్రభుత్వం పట్టేసిందన్న విషయం కలకలం రేపుతోంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఏపీకి పెట్టుబడులను రాబట్టడం కోసం ఏపీ సచివాలయం నుంచి జపాన్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లిన కాల్స్ ను కూడా తెలంగాణ ట్యాప్ చేసిందన్న ప్రాథమిక ఆధారాలను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునే కుట్రలో భాగంగానే తెలంగాణ ఈ ఫోన్ కాల్స్ ను చేసిందని ఏపీ భావిస్తోంది. ఇదే విషయంపై కోర్టుకు కాస్తంత గట్టి ఆధారాలే సమర్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సదరు ఆధారాల కోసం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.