: ఆ రెండేళ్ల కోసమే వస్తే అక్కర్లేదు... టీ-ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కారు!
తెలంగాణలో స్థానికులుగా ఉండి, ఆంధ్రాకు కేటాయించబడ్డ ఉద్యోగులకు ఏపీ సర్కారు పెద్ద షాక్ ఇచ్చింది. ఉద్యోగుల కేటాయింపు తరువాత, తాము తెలంగాణ వాళ్లం కాబట్టి ఏపీకి వెళ్లేదిలేదని కమల్ నాథన్ కమిటీకి లేఖలు రాసిన ఉద్యోగులు, ఇప్పుడు ఏపీలో విధులు నిర్వహించేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో 58 ఏళ్లకే పదవీ విరమణ కావాల్సివుండటం, ఏపీలో అయితే 60 ఏళ్ల వరకూ విధుల్లో ఉండే సౌలభ్యం ఉండటమే ఇందుకు కారణం. తొలుత ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడని తెలంగాణ ఉద్యోగులు, పదవీ విరమణ గడువైన 58 ఏళ్లు దాటగానే ఏపీలో చేరేందుకు బారులు తీరారు. గడచిన మూడు నెలల వ్యవధిలో ఎంతో మంది ఉద్యోగులు ఏపీలో రిపోర్ట్ చేసి తమను కొనసాగించాలని కోరగా, ఇలా రెండేళ్ల సర్వీసు కోసం వస్తున్న వారిని తీసుకోరాదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించగానే విధుల్లో చేరిన తెలంగాణ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదని, వారు రెండేళ్ల సర్వీసును ముగించుకోవచ్చని స్పష్టం చేశారు.