: హైదరాబాద్ లో ఆంధ్రోళ్లున్నందుకు తాగునీరు మీరే ఇచ్చుకోండి!: హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలో 40 లక్షల మంది ఆంధ్రావాళ్లున్నారని, వాళ్లకు మంచినీరు అందించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుదేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కృష్ణా నది నుంచి 60 టీఎంసీల నీటిని హైదరాబాద్ నగరానికి తరలిస్తే, అందులో 25 టీఎంసీలను ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలే వాడుకుంటారని, ఆ నీటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఏపీ సర్కారు, ఆంధ్రా ప్రజలకు నీరివ్వవద్దని చెబుతున్నట్టా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ రాసిన లేఖలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆగలేదని, ఇక పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు ఎలా ఆగుతాయని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోలేక, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ ప్రాజెక్టులను కొత్తవిగా చంద్రబాబు చూపుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.