: లోకేష్, బ్రాహ్మణి ఫోన్లూ ట్యాపింగ్... ఏపీ వద్ద ఆధారాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, తెదేపా యువనేత లోకేష్, ఆయన సతీమణి, హీరో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ఫోన్ సంభాషణలనూ తెలంగాణ అధికారులు ట్యాప్ చేసినట్టు ఏపీ పోలీసులకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ఈ విషయంలో టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలు పాటించకుండా, ముందస్తు అనుమతి లేకుండా ఫోన్లను ట్యాప్ చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ సర్కారు, హైకోర్టులో గట్టిగా 'కౌంటర్' దాఖలు చేయాలని నిర్ణయించింది. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం, దేశ భద్రత, శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న అనుమానం ఉంటే, ఆయా వ్యక్తుల ఫోన్ సంభాషణలు ట్యాపింగ్ చేయవచ్చు. అది కూడా హోంశాఖ కార్యదర్శి నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకొన్న తరువాతనే ముందడుగు వేయాల్సి ఉంటుంది. తెలంగాణ సర్కారు ట్యాప్ చేసినట్టు భావిస్తున్న నంబర్లలో ఎవరూ సెక్షన్-52లోని జాబితా కిందకు రారని చెబుతున్న ఏసీబీ న్యాయవాదులు, తాము అందించిన జాబితాలోని 25 మందికి ట్యాపింగ్ చట్టం ఎలా వర్తిస్తుందో నిరూపిస్తేనే తెలంగాణ చేస్తున్న వాదన కోర్టులో నిలుస్తుందని, లేకుంటే ఆ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని భావిస్తున్నారు.