: సంచలనం సృష్టించిన ఆంధ్రా క్రికెటర్ స్నేహదీప్తి
ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెటర్ స్నేహదీప్తి ఏసీఏ నార్త్ జోన్ సీనియర్ మహిళల క్రికెట్ పోటీల్లో ఒక్క రోజే 350 పరుగులు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. తాను ఎదుర్కొన్న 168 బంతుల్లో 58 ఫోర్లు, 11 సిక్స్ ల సాయంతో స్నేహదీప్తి ఈ స్కోరు సాధించింది. దీంతో ఆంధ్ర అండర్-19 క్రికెటర్ హారికా యాదవ్ పేరిట ఉన్న 308 పరుగుల వ్యక్తిగత రికార్డు బద్దలైంది. కాగా, ఈ రెండు రికార్డులూ విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల లోనే నమోదు కావడం గమనార్హం. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో విశాఖ జట్టు, శ్రీకాకుళం జట్టుపై 503 పరుగుల ఆధిక్యంలో విజయం సాధించింది. విశాఖ జట్టు 50 ఓవర్లలో 608 పరుగులు సాధించగా, శ్రీకాకుళం జట్టు 24.5 ఓవర్లకే 105 పరుగులకు ఆలౌట్ అయింది.