: రెండో భార్య కారణంగా మొదటి భార్యకు నిర్వహణ ఖర్చును తిరస్కరించకూడదు: ఢిల్లీ కోర్టు
మొదటి భార్యకు, ఇద్దరు పిల్లలకు తాత్కాలిక నెలవారీ నిర్వహణకు రూ.8000 వేలు ఇవ్వాలని గృహ హింస కేసులో భర్తను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. తన రెండో భార్య నిర్వహణను చూసుకోవల్సిన కారణంగా తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మోనా తర్ది కర్కెట్టా పేర్కొన్నారు. ఇదే సమయంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, తన రెండో భార్య యోగక్షేమాలను చూసుకోవాలంటూ అతను చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. అయితే తమ ఆర్థిక పరిస్థితులను నిరూపించుకునేందుకు సరైన ఆదాయ ప్రమాణం లేదంటూ ఇరువైపుల వారు చేసిన వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. సదరు మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం, తన భర్త చేసే హోటల్ వ్యాపారం నుంచి నెలకు రూ.55వేలు వస్తాయని, తాను మాత్రం ఎలాంటి వృత్తి అర్హత లేకుండా హౌస్ మేకర్ గా ఉన్నానని చెప్పింది. ఆమె భర్త మాత్రం భార్య వాదనలను ఖండించాడు. తన తండ్రి చేసే వ్యాపారానికి సహాయకుడిగా ఉంటున్నానని, నెలకు రూ.10,000 సంపాదిస్తానని చెప్పాడు. అంతేగాక తాను డయాబెటిక్ అని, తన రెండో భార్య నిర్వహణను కూడా చూసుకోవాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో అతని వేతనానికి, వ్యాపారానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అంటే అతని వాస్తవ ఆదాయాన్ని తెలియకుండా ఉంచే ఏకైక ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు కనిపిస్తోందిని వ్యాఖ్యానించింది.