: నాడు సిమ్ కార్డులు అమ్ముకున్న బాలుడు నేడు వ్యాపారవేత్తగా దూసుకెళ్తున్నాడు!


అతని పేరు రితీష్ అగర్వాల్. వయసు కేవలం 21 సంవత్సరాలే. అయితేనేం, అతని కథను ఓ సినిమాగా తీయవచ్చు. రితీష్ కు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2011లో, అతను స్థాపించిన హోటల్ రూం నెట్ వర్క్ సంస్థ 'ఒరావల్ స్టేట్' (ఇప్పుడు దాని పేరు ఓయో రూమ్స్) అభివృద్ధి నిమిత్తం జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 636 కోట్లు) పెట్టుబడిగా పెట్టింది. దీంతో రితీష్ పేరు దేశ విదేశాల్లో మారుమోగుతోంది. ఎంతో మందికి స్ఫూర్తి నిస్తున్న రితీష్ కథ ఏంటంటే... ఈ కథ 2010లో ప్రారంభమైంది. ఇంజనీరింగ్ పరీక్షలు రాయాలనుకున్న రితీష్, వాటికి సరైన రీతిలో సన్నద్ధం కాలేకపోయాడు. అంతకుపూర్వం బతికేందుకు సిమ్ కార్డులను విక్రయించాడు. ఉండేందుకు సరైన వసతుల్లేక ఎన్నో రాత్రులు మెట్ల మీద నిద్రపోయాడు. ఒకదశలో రితీష్ అవస్థలు చూసి ఒడిశాలోని స్వగ్రామానికి వచ్చేయమని కుటుంబం నుంచి ఒత్తిడి కూడా వచ్చింది. వీటినేవీ ఖాతరు చేయని రితీష్ తన 18వ ఏట హోటల్ రెంటల్ స్టార్టప్ 'ఓరావల్ స్టేస్'ను ప్రారంభించాడు. అతని కాన్సెప్ట్ ఒక్కటే... "ఇప్పుడు బుక్ చేసుకో... హోటల్లో డబ్బు కట్టు". ఇదే అతని విజయ రహస్యమైంది. కంపెనీ విస్తరణ బాటలో సంస్థ పేరును 'ఓయో రూమ్స్'గా మార్చేశాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, యాత్రికులు వెళ్లే పుణ్య క్షేత్రాలు, టూరిజం స్పాట్స్ లో హోటల్ యజమానులతో సంప్రదింపులు జరిపాడు. కాంట్రాక్టులు తీసుకున్నాడు. ఎవరు హోటల్ రూం బుక్ చేసుకున్నా, ఒక్క రూపాయి కూడా ఆన్ లైన్లో కట్టక్కర్లేదు. హోటలుకు వెళ్లి కడితే చాలు. హోటల్ రూముల చిత్రాలు, అక్కడి సదుపాయాలను ఓయో వెబ్ సైట్లో ఉంచాడు. కస్టమర్ల సంఖ్య పెరిగింది. తనతో పాటు వందల మందికి ఉపాధి చూపాడు. అయితే, ఇతనిపై కొన్ని విమర్శలూ ఉన్నాయి. ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వట్లేదన్నది ప్రధాన అభియోగం. అటువంటి విషయాలను చర్చించేందుకు రితీష్ ఒప్పుకోడు. సింపుల్ గా "మంటను మరింతగా ఎగదోయడం నాకిష్టం ఉండదు" అంటాడు. కాగా, 2020 నాటికి ఇండియాలోని బిలియనీర్ల క్లబ్ గణనీయంగా పెరుగుతుందన్న అసోచామ్ అంచనాలు నిజం అవుతాయనడానికి రితీష్ వంటివారి విజయాలే నిదర్శనం.

  • Loading...

More Telugu News