: రిమాండు ఖైదీకి స్టార్ హోటల్లో వీఐపీ లంచ్... ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
కోట్లకు అధిపతిగా ఉన్న నిందితుడిని స్టార్ హోటల్లో దర్జాగా భోజనం చేసేందుకు అనుమతించిన ఐదుగురు పోలీసులను కేరళ సర్కారు సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే, కేరళకు చెందిన పారిశ్రామికవేత్త ముహమ్మద్ నిషాన్, తన 'హమ్మర్' కారులో వెళుతూ సెక్యూరిటీ గార్డును ఢీకొట్టి అతని మరణానికి కారకుడయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా రిమాండులో ఉన్న అతన్ని ఐదుగురు పోలీసుల ఎస్కార్ట్ తో జైలు అధికారులు కోర్టుకు పంపారు. నిషాన్ కేసు విచారణ మరికొద్ది గంటల తరువాత బెంచ్ మీదకు వస్తుందని తెలుసుకున్న పోలీసులు, నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలసి సమీపంలోని స్టార్ హోటల్లో ప్రత్యేక గదిలో భోజనం చేసేందుకు ఒప్పుకున్నారు. అంతేకాదు, ఆ పార్టీలో వారూ చేరిపోయారు. ఈ ఘటన బయటకు పొక్కడంతో, హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన ఉన్నతాధికారులు వారందరినీ సస్పెండ్ చేశారు.