: జడ్జిని హింసించి చంపిన ఐఎస్ అనుబంధ మిలిటెంట్లు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు అనుబంధ మిలిటెంట్లు దారుణానికి ఒడిగట్టారు. లిబియాలో ఓ జడ్జిని కిడ్నాప్ చేసి, ఆపై హింసించి చంపారు. అల్-ఖోమ్స్ అప్పీల్ కోర్టుకు చెందిన మహ్మద్ అల్-నమ్లి అనే ఈ న్యాయమూర్తి మృతదేహం మంగళవారం అల్-హరావా పట్టణం సమీపంలో పడి ఉండగా గుర్తించారు. ఆయనను తీవ్రంగా హింసించి, కడతేర్చినట్టు దేహంపై గాయాలు చెబుతున్నాయని లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ తెలిపింది. వారం క్రితం సిర్టే నగరంలో ఆయన కిడ్నాప్ కు గురైనట్టు పేర్కొంది. వర్గ పోరులో ఓటమిపాలైన లిబియా డాన్ మిలీషియా వర్గం సిర్టే నుంచి నిష్క్రమించాక, ఆ నగరం ఐఎస్ అనుబంధ మిలిటెంట్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది.